మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

  Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం
 

Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం

 telugu పండుగలు  తెలుగు - కథలు దేవిదేవతలు అద్భుతమైన తెలుగు సూక్తులు |telugu motivation|telugu ... 

హిందూ నాగరికత చారిత్రక కాలక్రమం: క్రీ.పూ. 2000లకు ముందు..... సింధు లోయ నాగరికత - క్రీ.పూ. 1500-500 .... వేదయుగం - క్రీ.పూ. 500-క్రీ.శ.500 .... ఇతిహాస, పురాణ,  చారిత్రక యుగం - క్రీ.శ. 500-1500 .... మధ్యయుగం - క్రీ.శ. 1500-1757 ..... పూర్వ ఆధునిక యుగం క్రీ.శ. 1757-1947 బ్రిటిష్‌‌ యుగం .... సనాతన ధర్మం యొక్క ముఖ్యమైన గ్రంథాలు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, ఆగమాలు మరియు స్తోత్రాలు. ఈ గ్రంథాలలో సనాతన ధర్మం యొక్క మూలాలు, సూత్రాలు, నైతిక నియమాలు మరియు ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నాయి. వీటిలో వేదాలు అత్యంత ప్రాచీనమైనవి మరియు ముఖ్యమైనవి, వీటిలో నాలుగు వేదాలు ఉన్నాయి: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అధర్వణ వేదం.

   

రుక్మిణీ కల్యాణము


విదర్భదేశపు రాజు భీష్మకునకు రుక్మి మున్నగు ఐదుగురు కుమారులున్నూ రుక్మిణియను కుమార్తెయును కలరు. రున్మిణి కృష్ణుని రూప వీర్య వైభములను గురించి విని కృష్ణునే వివాహము చేసుకొనుటకు నిశ్చయించుకొనెను. కృష్ణుడునూ రుక్మిణి రూప గుణములను విని ఆమెనే వివాహమాడ నిశ్చయించుకొనెను. రుక్మిణి తండ్రియు, బంధవులనూ ఈ వివాహమునకు అనుకూలురేగాని అన్నయగు రుక్మి ఆమెను శివుపాలునకు ఇవ్వ నిశ్చయించుకొని తగు ప్రయత్నములు చేయుచుండెను. ఈ సంగతి తెలిసిన రుక్మిణి తాను కృష్ణునే వివాహమాదలచినట్లు తన భావములను కృష్ణున కెరుక పరచుటకు పరమ ఆప్తుడైన బ్రాహ్మణుని ఒకనిని ద్వారకకు పంపెను. ఆ బ్రాహ్మణుడు కృష్ణుని సందర్శించి రుక్మిణి సందేశమును -ఆమె కృష్ణుని తప్ప ఇంకెవరినీ పెండ్లాడ దలచలేదనియూ, మరెవరితో నైన జరిగినచో ప్రాణాత్యాగము చేయుననియూ-తెల్పెను. అంతట కృష్ణుడు తన కన్నియు తెలుసు ననియు, రుక్మిణిని తప్పక వివాహము చేసుకొనెద ననియూ రథమునెక్కి ఆ బ్రాహ్మణునితో గూడ విదర్భదేశమునకు బయలుదేరెను.

ఇచ్చట భీష్మకుని గృహమున రుక్మిణిని, రుక్మి అభిప్రాయము ప్రకారము, శిశుపాలుని కిచ్చి వివాహము చేయుటకు ప్రయత్నములు జరుగుచుండెను. కృష్ణుడు వచ్చిన సంగతి తెలిసి భీష్మకుడు ఎదరేగి సత్కరించెను. ఈ వివాహవిషయమున పోరాటము వచ్చునేమో యను తలంపుతో బలరాముడు సేనాసమేతముగా వచ్చెను. తాను పంపిన బ్రాహ్మణుడు ఇంకనూ రానందుకు చింతించుచున్న రుక్మిణివద్దకు ఆ బ్రాహ్మణుడు వచ్చి కృష్ణుని రాకను తెల్పెను. ఆమె బ్రహ్మనందమొంది ఇంత మహోపకార మొనర్చినందుకు తగిన ప్రత్యుపకృతి ఏమియు తోచక, ఆదరమున నమస్కరించెను. మహాలక్ష్మి అవతారమగు రుక్మిణి అనుగ్రహము కల్గిన ఆ బ్రాహ్మణునికి లోపమేమి యుండును ! ఆమె ప్రకృతి రూపిణిగూడ యగుటచే ప్రకృతి సంబంధమైన సంసార అనర్థములు పోయి మోక్షము ప్రాప్తించునని తలంచవచ్చును. కృష్ణునిరాక తెలిసిన ప్రజలు రుక్మిణీకృష్ణులు ఒకరి కొకరు తగినవారనియు, వారి వివాహము జరుగుటకుగాను తమతమ పుణ్యములనుగూడ ధారపోయుచుండిరి.

మరునాడు ఉదయము రుక్మిణి మౌనవ్రతయై, పాదచారిణిగ ఊరిబయటనున్న గౌరీఆలయమునకు రాజ భటులు వెంటరాక, శంఖభేరీమృదంగవాద్యములతో సపరివారముగ బయలుదేరెను. ఆలయమున పరమేశ్వరిని పూజించి కృష్ణునే తనకు భర్తగా చేయమని ప్రార్థించి, తిరిగి వచ్చుచుండ అచ్చటకు విచ్చేసిన రాజకుమారులందరూ ఆమె సౌందర్యమునకు మోహపరపశులై మూర్ఛపోయిరి ఆమె వచ్చివచ్చి కృష్ణుని రథము సమీపించగనే, కృష్ణుడు ఆమెను రథముపై నెక్కించుకొని బలరామునితో గూడ ప్రయాణమయ్యెను. ఈ దృశ్యమును చూచిన జరాసంధుడు మున్నగు శిశుపాలుని పక్షమువారు, రుక్మిని ముందుంచుకొని కృష్ణునిపై యుద్ధమునకు బయలుదేరిరి. కానిన బలరామ యాదవసేవల చేత ఓడింపబడి తిరిగిపోయిరి. రుక్మిమాత్రము కృష్ణుని చంపి రుక్మిణిని తిరిగి తీసుకురానిదే పట్టణము ప్రవేశింపనని ప్రతిజ్ఞ చేయుటచే, ఆతడు కృష్ణుని వెంబడించెను. కృష్ణుడు అతనిని ఓడించి చంపబోగా రుక్మిణి కృష్ణుని పాదములు పట్టుకొని అన్నను చంపవలదని ప్రార్థించెను. ఆమె ప్రార్థననంగీకరించి రుక్మిని చంపక అతని మీసములను కేశములను క్షౌరము చేసి విరూపిగా చేయగా, విరూపత్వముగూడ చావుతో సమానమగుట రుక్మిణి బాధపడెను. బలరాముడు ఆమెను ఓదార్చెను. రుక్మి ఇట్టి పరాభవమును పొంది, ప్రతిజ్ఞ వమ్ము అయినందున, తన నగరమునకు పోక భోజకటమను పురము నిర్మించుకొని అచట నివసించెను. కృష్ణుడు రుక్మిణితో ద్వారకకు జేరి శాస్త్రోక్తవిధానమున అత్యంత వైభవముతో వివాహమాడెను. ద్వారకావాసులందరు రుక్మిణీకృష్ణుజూచి పరమానంద మందిరి.

సత్యభామా జాంబవతుల వివాహము

సత్రాజిత్తు సూర్యుని తపస్సు చేయగా సూర్యుడు అతనికి శమంతకమణిని అనుగ్రహించెను. దానిని ధరించి సత్రాజిత్తు ద్వారకకు వచ్చుచుండ ఆమణికాంతికి అందరూ, సూర్యుడే కృష్ణుని చూచుటకు వచ్చుచున్నాడనుకొని కృష్ణునితో చెప్పిరి. కృష్ణుడు ఆ కాంతి సూర్యుడుకాదనియు శమంతకమణి అనియు చెప్పెను. సత్రాజిత్తునకు ఆమణి ప్రతిదినము ఎనిమిదిబారువుల బంగారము ఈను చుండెను. ఇంకనూ ఆమణి వున్నచోట అరిష్టములు దుర్భిక్షములు వుండనేరవు ఆట్టి మహత్తర శక్తిగల మణి సామాన్యుల వద్ద కంటే మహారాజు వద్ద యుండుట శ్రేయస్కరమని కృష్ణుడు సత్రాజిత్తుతో, దానిని రాజైన ఉగ్రసేనునివద్ద వుంచమని చెప్పెను. అందుకు సత్రాజిత్తు నిరాకరించెను.

ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడగు ప్రసేనుడు అమణిని కంఠమున ధరించి వేటకు వెళ్ళగా ఒక సింహాము అతనినిచంపి మణిని తీసుకుపారిపోవుచుండ, ఆసింహమును జాంబవంతుడు చంపి మణిని తనగుహలోనికి తీసుకొనిపోయి తన కుమార్తె తొట్టెకు క్రీడాకందుకముగా గట్టెను. తన తమ్ముడు అడవి నుండి తిరిగిరాని కారణములు విచారించి, సత్రాజిత్తు, కృష్ణుడే ఆతని చంపి మణిని అపహరించుయుండునను నింద కృష్ణునిపై మోపెను. దేశ##క్షేమము కొరకు కృష్ణుడు మణిని రాజువద్ద వుంచమని చెప్పుటలోని ధర్మసూక్ష్మమును గ్రహించక సత్రాజిత్తు యిట్టి నీలాపనింద కృష్ణునిపై వేసెను.

కృష్ణుడు తనపై వేసిన నీలాపనిందను బాపుకొనుటకై కొందరు నగరవాసులతో గూడ అడవికేగి అచ్చట ప్రసేనుని కళేబరము చూచి అచ్చటి జాడలను బట్టి జాంబవంతుని గుహలోనికి జనెను. కూడావచ్చిన పౌరులు బయటనే ఉండిరి. కృష్ణుడు గహలోనికిజొచ్చి తొట్టెకు కట్టబడియన్న శమ తక మణిని తీసుకొనబోవ జాంబవంతుడు యుద్ధమునకు దిగెను. ఆయుద్ధము ఇరువది నెనిమిది దినములు జరిగెను జాంబవంతుడు తనతో ఇన్ని రోజులుపోరాడువారు, తన ప్రభువైన శ్రీరాముడే ఈ కృష్ణుని రూపమున వచ్చినట్లు తెలిసికొని క్షమార్పణ కోరగా కృష్ణుడు తనపై మోపబడిన అపవాదును పోగొట్టు కొనుటకై ఆమణిని తీసుకొనిపోవుటకు వచ్చినానని చెప్పెను. అంత జాంబవంతుడు సంతోషముతో ఆమణినిచ్చి తన కుమార్తెయగు జాంబవతిని కృష్ణునకు భార్యగా నొసంగెను. కృష్ణుడు జాంబవంతునకు ముక్తినొసంగెను

ఆ గుహద్వారమున పండ్రెండు దినములు వేచియున్న నగరవాసులు, కృష్ణునికి అపాయము సంభవించి యుండవచ్చునని తలంచి, దేవకీవసుదేవులతోనూ రుక్మిణితోనూ చెప్పగా వారు కృష్ణుడు క్షేమముగా వచ్చుటకుగాను దుర్గాదేవిని కొలిచిరి. దుర్గాదేవి పత్యక్షమై, కృష్ణుడు సురక్షితముగా మణితో తిరిగి వచ్చుచున్నాడని అభయమిచ్చెను. కృష్ణుడు వెంటనే మణితోనూ జాంబవతితోనూ తల్లిదండ్రులకు కనపడగా వారందరూ చనిపోయినవారు తిరిగి బ్రతికి వచ్చినంత పరమానందము పొందిరి.

కృష్ణుడు ఒక సభ చేసి సత్రాజిత్తుని పిలిపించి జరిగిన వృత్తాంతమంతయూ జెప్పి, సత్రాజిత్తు తనమీద వేసిననింద నిజము కాదని నిరూపించి ఆమణిని సత్రాజిత్తున కిచ్చివేసెను. ఆతడు సిగ్గుపడి కృష్ణునికి చేసిన అపచారమునకు పరిహారముగ తనకుమార్తెయగు సత్యభామను, మణిని కృష్ణునకి సమర్పించెను. కృష్ణుడు సత్యభామను భార్యగా స్వీకరించి మణినిమాత్రము సత్రాజిత్తునకే తిరిగి యిచ్చివేసెను. తరువాత కృష్ణుడు జాంబవతిని, సత్యభామను యధావిధిగా వివాహము చేసికొనెను.

ఆ మణికొరకై శతధన్వుడు సత్రాజిత్తుని చంపగా, కృష్ణుడు అది తెలిసికొని శతధన్వుని చంపి మణికానుపించకపోగా, అది శతధన్వుడు అకౄరుని వద్ద దాచినట్లు తెలిసికొని, దానిని తానుతీసుకొనక అకౄరుని వద్దనే వుంచెను.

ఇట్టి గొప్ప మహిమగల మణులు సామాన్యువలవద్ద వుండిన అనర్థములకు హేతువనియు, అది రాజులవద్ద ఉండవలెను గనుక దానిని ఉగ్రసేనుని వద్ద వుంచమని ఆనాడు కృష్ణుడు చెప్పిన మాటలు సత్రాజిత్తు నిరాకరించినందువలననే ఆతడు మరణమును పొందెను. ఈ చరిత్రను చదివిననూ విన్ననూ నీలాపనిందలు పోవునని కృష్ణుడు అనుగ్రహించెను.

ఒకనాడు కృష్ణుడు అర్జునుతో గూడ యమునానదికి దాహము తీర్చుకొనుటకై వెళ్ళి, అచ్చట తపస్సు చేయుచున్న కాళిందియను సుందరాంగిని చూచి నీవు ఎందులకు తపస్సు చేయుచున్నావని అడిగెను. అందుకు ఆమె 'నేను సవిత్రుని కుమార్తెను, కృష్ణుని భర్తగా కోరి తపస్సు చేయుచున్నాను, తామే ఇచ్చటకు వచ్చినారుగాన నన్ను అనుగ్రహింపప్రార్థన' అనెను కృష్ణుడు ఆమెను అనుగ్రహించి ద్వారకకు తీసుకొని పోయి వివాహము చేసుకొనెను.

మిత్రవింద యను కన్య కృష్ణునియందు గాఢమైన అనురాగము కలిగియుండ ఆమె సోదరులు మున్నగువారు వ్యతిరేకించిననూ లెక్కచేయక ఆమెను రథముపై నెక్కించుకొని ద్వారక తీసుకొని వచ్చి వివాహము చేసుకొనెను.

కోసల ప్రభువైనన నగ్నజిత్తు గొప్ప బలముగల తన ఏడు వృషభములను నిర్జించువానికి తనకుమార్తె నాగ్నజితిని యిచ్చి వివాహము చేతునని ప్రకటించెను. కృష్ణుడు ఆవృషభములు, అడ్డుపడిన ఇతర రాజులను గూడ నిర్జించి ఆమెను ద్వారకు కొనిపోయి వివాహమాడెను. అటుపిమ్మట, తన మేనత్తయగు శృతకీర్తికుమార్తె భద్రను, ముద్రపతి కుమార్తె యగు లక్ష్మణను వివాహము చేసుకొనెను. ఈ విధమున కృష్ణునకు ఎనిమిది మంది భార్యలు ఏర్పడిరి.

నరకాసురవధ

కృష్ణుడు సత్యభామతోగూడి గురుత్మంతునిపై వెళ్ళుచుండగా నరకాసురుడు సేనాసమేతుడై వచ్చి యుద్ధము చేసెను. కృష్ణుడు తన చక్రాయుధముతో వాని శిరము ఖండించెను. అప్పుడు పుష్పవర్షము కురిసెను. భూదేవి తన కుమారుడైన నరకుడు చనిపోగా దుఃఖించక అతడు అపహరించిన అదితి కుండలములను, వరుణుని గొడుగును, వైజయంతి వనమాలికను మహామణిని తెచ్చియిచ్చి నరకుని పపుత్రుడైన భగదత్తుని రక్షించమని ప్రార్థించెను. కృష్ణుడు అతనికి అభయమిచ్చెను. నరకాసురుడు అపహరించుకు వచ్చిన పదహారువేలమంది రాజకన్యలను చూడగా వారందరూ కృష్ణునే భర్తగా వరించి దైవప్రార్థనచేయ, వారి భావము గ్రహించి వారినందరనూ పల్లకీలపై ద్వారకకు పంపెను. ఇంకను నరకాసురుని వద్ద వున్న ఉత్తమ అశ్వములను గజములను కూడా ద్వారకకు కొనిపోయెను.

కృష్ణుడు దేవలోకమునకు జని నరకాసురు నుండి తెచ్చిన కుండములను అదితికివ్వగా, ఆమెయు, ఇంద్రుడునూ ఇంద్రాణియను బ్రహ్మానందమంది కృష్ణుని సత్కరించిరి, ఆ ఇంద్రలోకములోని నందనవనమునందున్న పారిజాతమును కోరగా ఆ వృక్షమును వెళ్ళగించి, అడ్డుపడిన వారిని నిర్జించి భూలోకమునకు తీసుకొనివచ్చి ద్వారకలో సత్యభామ ఉద్యానవనమున నాటెను. నరకాసుర భవనమునుండి తెచ్చిన 16 వేల మంది కన్యలకు వేరువేరు గృహములు నిర్మించి వారందరకూ తాను అన్ని రూపములతో ఏకకాలము వివాహము జేసి కొనెను. వారు ఎవరికి వారు కృష్ణుడు తమతోనే వున్నాడని, తమయందే అత్యంతానురాగము చూపుచన్నాడని అనుకొనునట్లు అచింతనీయవిలాసమును జూపుచూ, తాను ఆత్మానంద పరిపూర్ణుడయ్యూ సాధారణ గృహస్థుని రీతి గృహస్థాశ్రమ ధర్మములు నాచరించుచూ క్రీడించుచుండెను. ఒక్కొక భార్యకు నూరుగురు పరిచారికల చొప్పున ఏర్పాటు చేసి వారు చేయు సపర్యలతో పరమానందముగ నుండిరి.

రుక్మిణీ కృష్ణుల ప్రణయకలహము

కృష్ణుడు రుక్మిణితో అనేక విధములైన సరససల్లాపములతో క్రీడించుచూ-ఆమె సంతోషపూరితమైన ముఖమునే చూచుచుండి, మనస్సుకు కష్టము కలిగిన ఆమె ముఖము ఎట్లుండునో చూడవలెనను కుతూహలముతో ఒకనాడు ''రుక్మిణి, శిశుపాలుడు మున్నగు ఐశ్వర్యవంతులు, రూపగుణ సంపన్నులు అగు రాజులు నిన్ను వరించదలచి వచ్చిరిగదా, మీ అన్నయు, తండ్రియుగూడ అట్టివారియందే సుముఖులుగా వుండిరి గదా, మరినీవు, వారందరనూ వదలి, రాజ్యము లేనట్టియు, ఇతర రాజులకు భయపడి సముద్రమధ్యమున ఇల్లు కట్టకున్నవాడను, అకించనుడను అగు నన్నకోరి ఎందుకు వివాహము చేసుకొన్నావు? కులము ఐశ్వర్యము మున్నగునవి సమానముగా నున్నవారి మధ్యనే రాణించునుగాని అసమానుల మధ్య శోభించదుగదా! గుణహీనుడు, రాజ్యహీనుడు అయిన నన్ను నీవు దూరాలోచన లేకుండా వివాహము చేసికొంటివి. ఇప్పుడైననూ, నన్ను విడచి, తగిన ఉత్తమ పురుషుని వివాహమాడి సర్వకామములను పొందుము. ఉదాసీనుడనైన నాకు అదేమియు కష్టము కాదు'' అని అప్రియ వచనములు పలికెను.

ఇట్టి కఠినభాషణము ఎన్నడూ వినని రుక్మిణి దుఃఖాతి రేకమున తెలివితప్పి భూమిపై బడెను. అంత కృష్ణుడు, తన పానువు దిగి జాలిపడి తన నాల్గుచేతులతో లేవనెత్తి (కృష్ణుడు తన ఆంతరంగిక భక్తులైన రుక్మిణి, అర్జునుడు మున్నగువారికి మాత్రమే నాలుగు చేతులతో దర్శనమిచ్చును) కన్నీరు తుడిచి, కౌగలించుకొని ఆమెను ఓదార్చచూ ఇట్లనెను ''ఓ ప్రేయసీ, నీకు నాయందున్న ప్రేమ ఎంతగాఢమైనదో నాకు తెలుసును. ఎప్పుడును నీ సంతోష వికసితమైన ముఖమునే చూచు నాకు, నీ మనస్సుకు కష్టము కలిగినప్పుడు నీ ముఖమెట్లుండునో చూడదలచి ఈ ప్రణయ కలహము సాగించితిని. గృహాసక్తులై అన్యోన్య ప్రేమగల దంపతుల మధ్య ఇట్టి పరిహాసములు జరుగుచుండును. అట్టి సంగతినీ వెరుగక, దుఃఖముతో మూర్ఛపోయితివి. నీయందు ప్రేమలేక కాదు ఇట్లు మాట్లాడుట'' అనవిని, రుక్మిణి ఇట్లనెను ''సరిగాని, స్వామీ! మిమ్ములను నేను వరించినది నిజమే. త్రిమూర్తులకు ఈశ్వరుడైన నీ మహిమ ఎక్కడ? సామాన్య స్త్రీయైన నా స్థితి ఎక్కడ? నిజమునకు నీకంటె వేరుగా ఏమియు లేదుగనుక నీవు అకించడనువే! నీవు సమస్త పురుషార్థముల నొసగు పరమాత్మ స్వరూపడవు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ నిన్ను పూజుంచుచుందురు. సర్వము విసర్జించి మహర్షులు, యోగీశ్వరులు నిన్ను సేవించు చుందురు. ఆట్టివారితోడ నాకు సంబంధము కుదురునుగాని, సంసార బంధములో పడియున్న మాకు మీతో ఎట్లు కుదురును? అని కృష్ణుని కఠినోక్తులన్నింటికి ఆధ్యాత్మికముగ చక్కని వ్యాఖ్యానము చేసి సమాధానము చెప్పగా కృష్ణుడు సంతసించి కౌగలించుకొని ఆమెకు తృప్తి పొందించెను.

రుక్మిణికి, కృష్ణుడు తననే ఎక్కువగా ప్రేమించుచూ ఇతర భార్యలకన్న తనవద్దనే ఎక్కువకాలము గడుపు చున్నాడను గర్వము పొడసూపినందున దానిని పరిహరించుటకై కృష్ణుడు ఈ ప్రణయకలహమును సాగించెను. ఇదంతయూ కృష్ణుని నరలొక విడంబనము ఈ విధముగ తక్కిన భార్యలతో గూడ గృహస్థధర్మముల నడపుచు వారందరకూ ఆనందము కలుగుజేయుచుండెను.

కృష్ణుడు అందురిభార్యలతోను గృహస్థ ధర్మమును నడపుచుండ ఒక్కొక్క భార్యకు పదిమంది కుమారులు, వారికి తిరిగి పదేసి చొప్పున సంతానములు కలుగుచుండ, ఆయన పుత్రపౌత్రులు కొన్ని లక్షలకుపైగా పెరిగిరి. రుక్మిణి అన్నయగు రుక్మి పూర్వవైరమును మరచి, రుక్మిణి కుమారుడగు ప్రద్యుమ్నునకు తనకుమార్తెయగు రుక్మవతిని యిచ్చి వివాహము చేసెను.

నృగోపాఖ్యానము

ఒకనాడు పద్యుమ్నాది యదుకుమారులు, పిపాసా పీడితులై జలము కొరకు ఒక కూపము వద్దకు రాగా అందు పడి వున్న ఒక ఊసరవిల్లిని చూచి దానిని లేవనెత్తుటకు ప్రయత్నించిరి గాని వారివలనుపడలేదు. ఆ విషయము కృష్ణునకు తెలియజేయగా, అతగు అవలీలగా ఎడమచేతితో దానిని పైకి ఎత్తెను. కృష్ణుని హస్తస్పర్శమాత్రమున ఆ ఊసరవెల్లి సర్వాలంకార శోభితుడై అమరుడుగా మారెను. అంత కృష్ణుడు అడుగగా, ఆదేవత కృష్ణునికి నమస్కరించి ఇట్లు చెప్పెను ''స్వామీ నేను ఇక్ష్వాకు తనయడనగు నృగుడను రాజును. నేను అసంఖ్యాకములగు కపిలధేనువులను కనక శృంగములతోను వెండి గిట్టలతోను అలంకరించిదూడలతో సహా నిరుపేదలు, యోగ్యులు నగు బ్రాహ్మణోత్తములకు దానమిచ్చితివి. ఇంకనూ గో, భూ, హిరణ్య, అశ్వ, గజ, రథములను, దాసులతోడ కన్యలను ఉత్తమ బ్రాహ్మణులకు దానముగా సమర్పించితిని. వాపీకూపతటాకాది కాది ప్రతిష్ఠల గావించితిని. అనేక యజ్ఞముల నాచరించితిని. కాని దురదృష్టవశమున ఒక బ్రాహ్మణునకు నేను దానముచేసిన గోవు తప్పించుకొని నావద్దనున్న యితర గోవులతో కలియగా, దానినిగుర్తించలేక మరియొక బ్రాహ్మణునకు దానమిచ్చితిని. ఆ బ్రాహ్మణుడు ఆగోవును తీసుకొని పోవుచుండగా అంతకుపూర్వము తీసుకొన్న బ్రాహ్మణుడు దానిని గుర్తుపట్టి, ఆగోవు తనదని వివాదమునకు దిగెను. వారిద్దరు పోట్లాడుకొనుచూ నావద్దకు వచ్చిరి. నేను దానము చేసిన గోవునే తిరిగి దానము చేసిన పాపమునకు గురియైనందున ఈపాపపరిహారార్థము వారితో నిట్లంటిని 'ఓ బ్రాహ్మణోత్తము లారా, నేను తెలియక చేసిన ఈతప్పిదనమునకు నరకమున పడకుండా నన్ను అనుగ్రహింపుడు, మీ ఇద్దరిలో ఎవరు ఈ గోవును విడిచెదరో వారికి లక్ష గోవుల నిచ్చెదను ఎవరో ఒకరు గ్రహించి నన్ను అనుగ్రహించమని ప్రార్థించిననూ వారు వినలేదు. ఇంతలో నాకు కాలము ఆసన్నమై యమభటులు వచ్చి నన్ను యమధర్మరాజు నొద్దుకు తీసుకొనిపోయిరి. అప్పుడు యమధర్మరాజు ''నీవు చేసిన పుణ్యములు ఫలము చాలా కాలము అనుభవించ వచ్చును, దానమిచ్చిన గోవును తిరిగి దానమిచ్చిన పాపమునకు అప్పకాల భోగ్యమైన పాపఫలమును ముందు అనుభవించు'' అని నన్ను ఊరవిల్లి రూపమున మార్చెను. కృష్ణా! నీ కరస్పర్శచే నా ఊసరవిల్లి రూపము పోయి నాకు పూర్వస్మృతిగూడ వచ్చినది. నన్ను నా పూర్వపురూపములో నా లోకమునకు పోవునట్లు అనుగ్రహించుము. నాకు నీయందు అచంచల భక్తికలుగునట్లు అనుగ్రహించుము.'' అని నృగమహారాజు కృష్ణునకు ప్రణమిల్లి తనకై వచ్చిన విమానములో పుణ్యఫలము అనువించుటకు స్వర్గలోకమునకు వెడలిపోయెను.

అంతట కృష్ణుడు అచ్చటనున్న రాజులకు ఇట్లు నీతిని బోధించెను ''బ్రాహ్మణుని ధనమును అపహరించి తినినవాడు అగ్నిసదృశుడైన తేజస్వియైననూ దానిని అరగించుకొనలేడు. ఇతరుల గతి ఏమి? కాలకూట విషముకైననూ విరుగుడు దొరకవచ్చునుగాని, బ్రాహ్మణధనము అపహరించిన పాపమునకు ప్రతీకారము లేదు. విషము తిన్నవానినే చంపును. కాని బ్రాహ్మణధనము నపహరించినవారు తానేగాక తన కులము నశించుటకు గూడ కారకుడగును. అంతేకాదు అతని పూర్వులైన పదితరములవారిని, తరువాత పదితరములవారిని కూడ నశింపజేయును. బ్రహ్మస్వము, గోరినవారు కేవలము నరకమునే గోరినవారగుదురు. రాజ్యాధికార మదమున ఇట్టి పాపకృత్యములను కొందరు చేయుచుందురు. ఉత్తములైన దరిద్రబ్రాహ్మణులు తమ సొమ్ములు ఇతరులు హరింపగా, వారు దుఃఖించు నప్పుడు వారి కన్నీటిబిందువులతో భూమిపై ఎన్ని అణువులు తడియునో అన్ని సంవత్సరములు, అపహరించిన రాజులునూ వారి వంశీయులునూ కుంభీపాక నరకమున బడుదురు. బ్రాహ్మణ వృత్తిని అపహరించినవాడు, అరువది వేల సంవత్సరములు అశుద్ధములో పురుగై తిరుగును. బ్రాహ్మణ ధనమును ఎవరును అపహరించ గూడదు. బ్రాహ్మణుడు తప్పజేసిననూ, కొట్టిననూ, తిట్టిననూ, సహించవలెనేగాని తిరిగి కీడు చేయరాదు. నేను బ్రాహ్మణులకు ఎట్లు మ్రొక్కుచున్నానో మీరు చూచుచున్నారు. గదా ! మీరును నన్ను అనుసరింపుడు. బ్రాహ్మణ ద్రవ్యమును తెలియక హరించిననూ వానికి నరకము తప్పదు. వింటిరిగదా ఈ నృగమహారాజు చరిత్ర !'' ఇట్లు ద్వారకా పురవాసులందరకూ నీతిబోధ చేసి నిజమందిరమునకు వెడిలిపోయెను.

పౌండ్రకవాసుదేవుని కథ

కరూశపతియగు పౌండ్రకుని వాసుదేవునిగా కొందరు స్తుతించుటచేత ఆ యిచ్చకపు మాటలకు ఉబ్బిపోయి తాను నిజముగా వాసుదేవుడైనట్లు భ్రమించి, అసలు వాసుదేవుడు తానే అనియూ, శంఖచక్రాదుల వదలి తనను శరణు వేడమనియూ, అట్లు కానియడల యుద్ధమునకు సిద్ధము కమ్మని, కృష్ణుని వద్దకు రాయబారమంపెను. ఆసభలోని వారందరూ ఆ దూత వ్యాక్యములు విని నవ్వగా కృష్ణుడు యుద్ధమునకు సిద్ధమేయని కబురంపెను.

అంతట నాటక వేషధారివలె శంఖచక్రవనమాలికలను ధరించి పీతాంబర ధారియై కృత్రిమ వేషధారివలె వచ్చన పౌండ్రక వాసుదేవుని కృష్ణుడు తన చక్రాయుధముతో వాని శిస్సును ఖండించెను. పౌండ్రకుడు నిత్యము కృష్ణుని రూపమును ధరించవలెనని ధ్యానించుటచేత, మనస్సులోని మాలిన్యము నశించగా, కృష్ణతన్మయుడై ఉత్తమ గతిని పొందెను.

నారదుడు కృష్ణలీలు చూడ ద్వారకకు వచ్చుట

నరకాసుర వధానంతరం పదియారువేల కన్నియలను కృష్ణుడు వివాహము చేసికొని వారందరతో, విడివిడిగా గృహముల నిర్మించి, ఆనందించు చున్నాడను అద్భుతవిషయమును విని, కనులార చూచుటకు ద్వారకకు బైల్దేరెను. అచ్చట రాజకన్యల గృహములలో ప్రతి ఇంటనూ కృష్ణుడు ఆయా భార్యలతో విడివిడిగా జరుపుచున్న లీలలను చూచి తన్మయుడై కృష్ణునితో యిట్లనను ''యోగేశ్వరేశ్వరా! యోగులకుగూడా తెలియరాని మీ యోగమాయా విలాసమును ప్రత్యక్షముగా చూచు భాగ్యము నేడు కలిగినది. పరమ పావనమైన నీ లీలలు కీర్తించుచూ లోకములలో తిరుగుటకు అనుజ్ఞనిమ్మని ప్రార్థించెను, కృష్ణుడు 'బ్రహ్మర్షీ' అట్లే నా లీలలను కీర్తింపు కాని వానికి మోహపడవలదు' అని చెప్పిపంపెను.

ధర్మరాజు రాజనూయము - జరాసంధ వధ

జరాసంధునిచే బంధింపబడి చెరసాలలో మ్రగ్గుచున్న ఇరువది ఐదుగురు రాజులు భాధలకోర్వలేక రక్షింపుమని కృష్ణుని వద్దకు దూతను పంపిరి. కృష్ణడాదూతకు అభయమిచ్చి పంపివేసెను.

ఒకనాడు నారదుడు కృష్ణసన్నిధికి వచ్చి 'సామ్రాజ్య పదవి పొందుటకు ధర్మరాజు రాజసూయ యాగము తలపెట్టి నిన్ను ఆహ్మానింపమని నన్ను పంపినా'డని చెప్పెను. అంత కృష్ణుడు ఉద్ధవునితో ఉద్ధవా నేను జరాసంధుని సంహరించుచుటకుగాను వెళ్ళు ప్రయత్నంలో నుండగా ధర్మరాజు ఆహ్వానము వచ్చినది. ఈ రెంటిలో దేనికి ముందు వెళ్ళవలెనో నీవు చెప్పుము' అని సర్వజ్ఞుండయ్యూ తెలియని వానివలె అడిగెను. అంద ఉద్ధవుడు 'కృష్ణా' రాజసూయ యాగమునకు అరుగుటయే సముచితమని నాకు తోచుచున్నది. ఏలనన, రాజసూయ యాగమున ఇతర రాజులను జయించవలసి యుండును. ఆ సందర్భమున జరాసంధ వధ కూడా కావింపవచ్చును. ఇట్లు రెండు పనులు ఏకకాలమున నెరవేరును' అనివిన్నవించగా, కృష్ణుడు, ద్వారకా వాసులు నందరనూ ఇంద్ర ప్రస్ధమునకు తరలించుటకు వెళ్ళెను.

ధర్మరాజు ఉపాధ్యాయ సుహృత్‌ పరివృతుడై కృష్ణుని కెదురేగి, గాఢాలింగనము చేసుకొని ఆనంద బాష్పములు రాల్చెను. కృష్ణుడు తనకంటె వయసున పెద్దలైన ధర్మరాజు, భీములకు నమస్కరించి, సమానవయస్కుడైన అర్జునుని కౌగలించుకొని, తనకంటె పిన్నలైన సకుల సహదేవులను దీవించి, తదితరుల నందరనూ తగురీతిని ఆదరించెను.

కృష్ణచంద్రుడు వచ్చినాడని విని పౌర సుందరులందరు తాము చేయుచున్న పనులను విడిచి వచ్చి కృష్ణుని దర్శించి తమతమ మనస్సులలో ఆలింగనము చేసుకొన్నట్లు తన్మయ భావన చెందిరి. కృష్ణుడు కుంతికి పాదాభివందనము చేసి, ద్రౌపదీ సుభద్రలను దీవించెను. ద్రౌపది కృష్ణుని వెంటవచ్చిన రుక్మీణీ, సత్యభామా మున్నగు ఎనిమిది మంది భార్యలను ఉచితరీతిన పూజించి వారితో వచ్చిన ముత్తైదువులను సత్కరించిరి.

ధర్మరాజు తానుచేయు రాజసూయ యాగమును గురించి కృష్ణునకు విన్నవించి అది జయప్రదమగునట్లు అనుగ్రహింప ప్రార్థించెను. అంతట కృష్ణుడు ''నీ సంకల్పము ఉత్తమమగుటయే గాక సర్వభూతములకు, ఋషులకు సమ్మతమైనది. రాజులనెల్ల జయించి జగతీమండలమునెల్ల వశపరుచుకొని, సర్వ సంభారములు సమకట్టి ఈ మహాక్రతువు నాచరింపుము. లోకపాలాంశ సంభూతులైన తమ్ములు అండగానుండగా నీకు దిగ్విజయము కలుగక పోవునా!'' అని ప్రోత్సహించెను. అంత ధర్మరాజు తమ్ములను పిలిచి సహదేవుని దక్షిణమునకును, నకులుని పశ్చిమమునకును, అర్జునుని ఉత్తరమునకు, భీముని తూర్పునకును సేనాసమేతముగ విజయార్థము పంపెను. వారు ఆయాదేశముల రాజుల జయించి రాజసూయమునకు బహుళ ధనమును తెచ్చి సమర్పించిరి. రాజులందరూ జయింపబడిరిగాని జరాసంధుడు జయింపబడలేదు. ధర్మరాజు అనుమతితో కృష్ణుడు భీమార్జునులను తీసుకొని బ్రాహ్మణవేషముతో జరాసంధుని యొద్దకు జనిరి. జరాసంధుడు అతిధిపూజ చేసిన తదుపరి వారు మేము కోరినది యివ్వమని అడిగిరి. వారిని చూడ బ్రహ్మణ వేషములోనున్న క్షత్రియులని తోచిననూ పూర్వము వామనావతారములో వచ్చిన విష్ణువు కోరికను బలి పూర్తి చేసినట్లు, వీరెవరైననూ, కోరినది ఇచ్చుటే ధర్మమని భావించి అందుకు అంగీకరించెను. కృష్ణుడు మాకు ద్వంద్వ యుద్ధము కావలెనని కోరి మారువేషములు త్యజించి, మేము కృష్ణార్జున భీములము, అని స్వస్వరూపములను వ్యక్తము చేసిరి. తనతో సమాన బలము కలవాడు భీముడే గనుక అతనితో ద్వంద్వ యుద్ధము చేయుటకు జరాసంధుడు అంగీకరించి భీమునికి ఒక గదను యిచ్చి గదాయుద్ధమును ప్రారంభించెను. కొంతవడి ఘోరయుద్ధము సాగగా గదలు రెండును భిన్నములయ్యెను. అంతట ఇద్దరునూ ముష్టిప్రహారములకు పూనుకొని యుద్ధము చేసిరి. ఎంతటికీ జరాసంధుడు యిసుమంతయూ అలియక యుద్ధము చేయుట చూచి కృష్ణుడు అతనిని సంహరించు ఉపాయమును భీమునికి సూచించుచూ ఒక పుల్లను తీసుకొని రెండుగా చీల్చి ఇటుదిఅటు, అటుదిఇటు పడవేసి చూపెను భీముడు వెంటనే జరాసధుని క్రిందపడవేసి ఒక కాలును తన కాలితో త్రోక్కి రెండవకాలును పట్టి శరీరమును రెండుగా చీల్చి ఇటుదిఅటు, అటుదిఇటు పడవైచెను. అంతటితో జరాసంధుడు నిర్జీవుడయ్యెను. కృష్ణార్జునులు భీముని కౌగలించికొని ప్రశంశించిరి. జనులందరూ సంతోషించిరి.

కృష్ణార్జున భీములు తరువాత జరాసంధునిచే బంధింపబడిన రాజులనందరునూ విడిపించగా వారు కృష్ణునుకి నమస్కరించి స్తోత్రముచేసి, తాము తరించు ఉపాయము తెల్పమని ప్రార్థించిరి. అంతట కృష్ణుడు ''మీకందరకునూ సర్వేశ్వరుడను, సర్వాత్ముడను అగు నామీద ధృడమైన భక్తి కలిగిన తరింతురు. ఐశ్వర్యమదము ఉన్మాదకరము గాన, దానిని వెంటనే త్యజింపవలెను. పూర్వము సహుషుడు, రావణుడు, నరకాసురుడు మున్నగు వారందరూ ఐశ్వర్యమదముచే భ్రష్టులైరి. పుట్టునదెల్ల గిట్టునని తెలిసికొని మీరు నన్ను శాస్త్రోక్త విధానమున అరాధించుచూ, ప్రజలను ధర్మమార్గమున పాలించుచూ, కాలప్రాప్తమైన సుఖదుఃఖాదులను అనుభవించుచూ, దేహాదులయడ ఉదాసీనులై చిత్తముల నాపై నిలిపి దృఢ వ్రతులైన యడ మీరు ఆత్మారాములై తరించెదరు.'' అని వారికి భోదించి, ఆ రాజులకు అభ్యంగన ములు చేయించి, వస్త్ర మాల్యానులేపన భూషణాదుల ధరింపజేసి, మృష్టాన్నము భుజింపజేయగా వారు అత్యంతానందముతో స్వీకరించి కృష్ణునివ్ద శలవు గైకొని తమతమ రాజ్యములకేగి, కృష్ణుడాదేశించిన ప్రకారము ఆచరించుచూ రాజ్యపాలన జేసిరి.

ఇట్లు జరాసంధ వధానంతరము భీమార్జునులతో కృష్ణుడు తిరిగి ఇంద్రప్రస్థమునకు వచ్చి ధర్మరాజునకు జరిగిన వృత్తాంతము చెప్పగా జరాసంధుడు గూడ హతుడైనాడు గనుక ఇక రాజసూయయాగము ప్రారంభించెదమని ధర్మరాజు కృష్ణుని అనుజ్ఞ కోరెను.

రాజసూయయాగమునకు ద్వైపాయనుడు. భరద్వాజుడు, గౌతముడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వామదేవుడు, పరాశరుడు, కశ్యపడు ధౌమ్యుడు మున్నగు బ్రహ్మవాదులైన బ్రాహ్మణులను ఋత్విక్కులుగా నియమించెను. ఈ యాగమును చూడ సకలదేశ రాజన్యులును, చాతుక్వర్ణ ములవారును విచ్చేసిరి. యజ్ఞవేదికను బంగారు నాగళ్ళతో దున్ని, వేదికాది సంస్కార మొనర్చి ధర్మరాజునకు యజ్ఞదీక్ష నిచ్చిరి. యాగము జయప్రదముగ నిర్వహింపబడి, సోమాభిషన దినమున యాజకులను సదస్యులను పూజించు సమయము రాగా, ప్రప్రథమ పూజార్హుడెవరను ప్రశ్న ఉదయించగా సహదేవుడు, భగవంతుడకు కృష్ణుడే ప్రప్రథమ పూజార్హుడని గట్టిగా చెప్పి కృష్ణుని యొక్క యోగ్యతలను మాహాత్మ్యమును విశదీకరించెను. అందుకు సభాసదులందరూనూ అంగీకరించిరి. అంతట ధర్మరాజు ప్రథమపూజ చేయుటకై కృష్ణుని పాదారవిందములు కడిగి ఆ పావనోదకమును తాను, భార్య, తమ్ములు, పరివారము శిరస్సున జల్లుకొనిరి. తరువాత పీత కౌశేయ వస్త్రములను ఉత్తమ భూషణములను సమర్పించి బ్రహ్మానంద మందెను. అచట సమకూడిన రాజులు జయజయ నినాదములు చేయ పుష్పవృష్టి కురిసెను.

ఇందతయూ చూచి సహించలేని శిశుపాలుడు కృష్ణుడు పూజార్హుడు కాడని అనేక విధముల, నిందించెను. ఆ నిందను సహించలేక కొందరు ఆతని పైకి యుద్ధమునకు రాగా కోలాహాలమయ్యెను. కృష్ణుడు వెంటనే తన చక్రాయుధమును ప్రయోగించి శిశుపాలుని శిరము ఖండించెను. శిశుపాలుని శరీరములోని తేజస్సు కృష్ణునిలో ప్రవేశించెను. వైరముచే నిత్యము స్మరించుచు శిశుపాలుడు కృష్ణునిలో ఐక్యము నొందెను, ధర్మరాజు మిగిలిన వారిని దక్షిణలతో సత్కరించి యాగమును జయావహముగా ముగించెను. ఈ యాగమున, భీముడు పాకశాలాధ్యక్షుడుగను, దుర్యోధనుడు ధన్యాధ్యక్షుడుగను, సహదేవుడు వచ్చినవారికి స్వాగతము పలుకుటకు, నకులుడు వస్తుసంపాదనకు నియుక్తులైరి. దానమునకు కర్ణుడు, వచ్చిన పెద్దలకు పాదప్రక్షాళనచేయుటకు కృష్ణుడు, సాధుజనపరిచర్యకు అర్జునుడు పూనుకొనిరి.

అవబృధస్నానమునకు, ధర్మరాజు కృష్ణుడు, సోదరులు, రాజులు వెంటరా, గంగానదికి జని వేదఘోష మార్మ్రోగ, అవబృధస్నానము లాచరించిరి. ఇట్టి స్నానము వలన సర్వపాపములు హరించును. ధర్మరాజు అనుజ్ఞతో రాజుందరూ వెడలిపోయిరి. కృష్ణుడు మాత్రము ధర్మరాజు కోరినందున ఇంద్ర ప్రస్థమున నిలచి, మిగిలిన వారిని ద్వారకకు పంపెను.

ఇట్లు రాజసూయయాగమున ధర్మరాజునకు జరిగిన వైభవమును చూచి దుర్యోధనుడు సహించలేక, నుయనిర్మిత సభలోకి వచ్చి, జలస్థల భేదములను తెలిసికొనలేక, జలమున స్థలభ్రాంతి, స్థలమున జలభ్రాంతి పొంది. క్రిందపడుచు లేచుచు చిక్కులు పడుచుండగా, భీముడు ద్రౌపది మున్నగు వారు నవ్విరి. ఆ నవ్వు భూభారహరణమునకు నాందిగా కృష్ణుడు భావించెను. దుర్యోధనుడు అసూయతో పాటు క్రోధమును, ద్వేషమును పెంచుకొనెను.

ఇట్లుండ, శిశుపాలుని మిత్రుడగు సాళ్వుడు, రుక్మిణీ కల్యాణమునాటి నుండి కృష్ణుని, యాదవులను నిర్మూలించ ప్రతిజ్ఞ చేసి శివునిగురించి తపస్సు చేసి కామగమనముగల సౌభమను విమానమును వరముగా పొంది ససైన్యముగా పోయి ద్వారకను ముట్టడించెను. ప్రద్యుమ్నుడు, సాత్యకీ మున్నగువారు ఆతనిని ఎదర్కొనగా ఆ విమానముతో ఒకప్పుడు కనపడుచూ, మాయమగుచూ; ఒకసారి భూమిమీద మరోకసారి ఆకాశములోనూ కనపడుచూ అద్భుత ప్రభావముతో యుద్ధము చేయుచుండ, కృష్ణుడు తన గదతో ఆ విమానమును పగులగొట్టి, సాళ్వుని శిరస్సు తన చక్రాయధముతో ఖండించెను. మిగిలిన సేనగూడ హతమయ్యెను. ఈ సంగతి విని దంతవక్తృడు కృష్ణునిపైకి దండెత్తి అనేక విధముల నిందించి కృష్ణుని శిరముపై తన గదతో కొట్టెను కృష్ణుడు వెంటనే తన కౌమోదకిశో వాని రొమ్ము పగుల గొట్టగా, వాడు నెత్తురు కక్కుకొని వెంటనే చనిపోయెను. శిశుపాలునిలో వలెనే దంతవక్తృనిలోని జ్యోతిగూడా కృష్ణునిలో ఐక్యముమొందెను. తరువాత దంతవక్తృని సోదరుడైన విధూరధునిగూడ చక్రాయుధముచే సంహరించెను. ఈ విధముగా శిశుపాల దంతవక్త్రసాళ్వాదులను కృష్ణుడు అంతమొందించెను.

బలరాముడు, కౌరవ పాండవ యుద్ధమున ఏపక్షమును చేరక మధ్యస్థుడై తీర్థయాత్రకుజని ఒక సమయమున నైమిశారణ్యమునకు అరిగెను. అచట దీర్ఘసత్రయాగము జరుపుచున్న మునులందరూ బలరామునికి లేచి నమస్కరించగా వ్యాసశిష్యుడైన రోమహర్షుడు, ప్రవక్తగా నుండుటచే బలరామునికి లేచి నమస్కరించలేదు. బలరామునికి కోపము వచ్చి అతని శిరస్సు ఖండించెను అదిచూచి మునులు ''బలరామా! పురాణ ప్రవచనముకై మేమితనికి బ్రహ్మసన మిచ్చి కూర్చుండ బెట్టి దీర్ఘసత్రయాగము జరపుచుంటిమి. అట్టివానిని నీవు వధించితివి గాన నీకు బ్రహ్మహత్యాపాతకం వచ్చనది'' అని చెప్పిరి. బలరాముడు పశ్చాత్తాపమునొంది. యాగము విఘ్నము కాకుండా రోమహర్షుని కుమారుని ప్రవచనమునకు ఏర్పాటు చేసి, తన పాపమునకు ప్రాయశ్చిత్తం చెప్పమని మునులను కోరగామునులు 'ఇల్వలుని కుమారుడైన పల్వలుడను రాక్షసుడు ప్రతి పర్వమున మాసత్రయాగమును రక్త మాంసాదులతో భంగము చేయుచున్నాడు. కాన వానిని చంపి, పన్నెండు నెలలు కామక్రోధాదు లుడిగి భరతవర్షమంతయూ తిరిగి తీర్థముల స్నానమాడి కృచ్ఛము లాచరించినయడల నీ పాపవిముక్తి యగు''నని తెల్పిరి.

అంతట బలరాముడు ఆ రాక్షసుని తన హలాయుధముతో పట్టి ముసలముతో తల బ్రద్దలుకొట్టి చంపెను. మునులు బలరాముని ప్రశంశించిరి. తరువాత తీర్థయాత్రలు ప్రారంభించి, ప్రయాగలో స్నానమాచరించి, పులహాశ్రమము వద్ద గోమతీ, గండకీ, శోణ, భద్ర నదులలో స్నానమాది గయలో పిత్రుపూజ గావించి, గంగా సాగరసంగమమును సేవించి ; సప్తగోదావరి ప్రవాహములు, వేణీ-పంపా-భీమ నదులను సేవించి ; శ్రీశైలము, వేంకటాచలము అను తిరుపక్షేత్రమును, కాంచీపురము, కావేరీ నదిని. శ్రీరంగక్షేత్రమును, వృషభాద్రిని, దక్షిణమధురను సేవించి ; మహాపాతకనాశకమైన సముద్రసేతువున కరిగి, అచట విప్రులకు పదివేల గోవులను దానమిచ్చి ; తామ్రపర్ణిలో తీర్థమాడి, కన్యాకుమారిలో దుర్గాదర్శన మొనరించి, గోకర్ణము సేవించి, మాహిష్మతీనగరమువద్ద నర్మదను సేవించి, ప్రభాసక్షేత్రము చేరెను. అచ్చట కురుపాండవ యుద్ధము విశేషములు తెలిసికొని సర్వరాజన్యులు ససైన్యముగా నితుహలైనారనియు, ఇక భీమ దుర్యోధనుల యుద్ధము మాత్రము జరుగవలెననియు తెలిసికొనెను. వెంటనే బలరాముడు కురుక్షేత్రమునకు జని, భీమదుర్మోధనులు సమాన బలశాలురైననూ ఒకరికి బలిమి మరోకరికి విద్యాకౌశలము ఎక్కువ గనుక జయాపజయములు తేలుట కష్టముగాన యుద్ధము మానమని చెప్పెను. కాని వారు అంగీకరింపనందున, బలరాముడు తిరిగి ద్వారకకు వెళ్ళెను. ఇట్లు బ్రహ్మరధ ప్రాయశ్చిత్తము నాచరించి పాపమును పోగొట్టుకొనెనును.

కుచేలోపాఖ్యానము

శ్రీకృష్ణుని చరితమును విని పరీక్షిన్నరేంద్రుడు శుకయోగితో ఇట్లనెను: 'మునీంద్రా అనంతవీర్యుడైన ముకుందుని మహిమాన్వితములైన చరిత్రలు వినినకొలది ఇంకనూ వినవలెనని కుతూహలము కలుగుచున్నది. ఆ ఉత్తమ శ్లోకుని సత్కథలు ఒకసారి వినినతరువాత చాలునని ఎవరైన విరమించుదురా? భగవంతుని వచిందునదే వాక్కు, తత్పరి చర్యలు ఒనర్చునవే చేతులు, ఆయనకు తలమనదే మనస్సు. వాని పుణ్యచరితములు వినునవియే వీనులు. స్థావర జంగము లెల్ల తల్లింగములుగా మ్రొక్కునదేశిరము, తన్మూర్తులను జూచునవే కన్నులు, భాగవతుల పాదోదకము సేవించినదే అంగము. కనుక ఆ భగవంతుని మహిమాన్విత చరితము ఇంకనూ విన కుతూహల మగుచున్నది కాన చెప్పకోరెదను.'

అంత శుకయోగీంద్రుడు ఇట్లనెను: ''పూర్వము కుచేలుడను బ్రహ్మవిదుడైన బ్రాహ్మణుడు, కృష్ణునకు పిన్ననాట స్నేహితుడు, దరిద్రము నునుభవించుచుండెను. పరమ ప్రతివ్రతయైన కుచేలుని భార్య పతినుద్దేశించి, 'స్వామీ, మీరు సాక్షత్తు లక్ష్మీపతికి సుఖులుగదా, ఆయన శరణాగతరక్షకుడు, బ్రాహ్మణవత్సలుడు, అని ఖ్యాతిగన్నవాడు. బహుకుటుంబీకులై దారిద్య్రస్థితిలో నున్న మీరు ఆయనను ఆశ్రయించిన మన కష్టములు తొలగి ఐశ్వర్యవంతుల మగుదుము' అని చెప్పెను. ఈ విధముగానైన భగవంతుడగు కృష్ణదర్శనము కలుగునని, భార్య చెప్పిన ప్రకారము బయలుదేరి, కృష్ణునకు కానుకగా ఏదైన యిమ్మని భార్యను అడిగెను. ఇంటిలో ఏమియు లేనందున ఇరుగుపోరుగు వారివద్ద నాలుడు పిడికెడుల అటుకులు ప్రోగుచేసి కుచేలునిపై వస్త్రమునకు కట్టెను. అంత కుచేలుడు కృష్ణదర్శనము ఎట్లు చేతునా అని ఆలోచించుతూ, కృష్ణునియందే మనసునిల్పి ద్వారకకు జేరెను. తన భార్యతో పాన్పుపైనుండిన కృష్ణుడు కుచేలుని చూడగనే తటాలునలేచి కౌగలించుకొని, లోనికి తోడితెచ్చి తన పర్యంకమున కూర్చుండబెట్టి ఆతని పాదములు కడిగి శిరస్సున జల్లుకొని, కుచేలునికి మంచిగంధము శరీరమునకు అలది పూలమాలతో అలంకరించి పండ్లు

క్షీరములతో ఆదరించి సేవించెను.

కృష్ణుని భవమెరిగిన రుక్మిణి, కుచేలుడు జీర్ణవస్త్రములతో నున్ననూ ఏవగించుకొనక చామరముతో విసిరెను. ఈ బీదబ్రహ్మణునకు కృష్ణుడు చేయు సపర్యలకు అందరూ ఆశ్చర్యపడిరి.

తరువాత కృష్ణుడు కుచేలునితో గురుకుల వాసము చేసిన పిన్ననాటి కథలు జ్ఞాపకము చేసికొనుచూ ఆనందించి, కుచేలుని సంసారమును గూర్చి అడుగుచూ ' కుచేలా నీమనస్సు ఎప్పుడూ కామవ్యాకులము గాక ధనమునకు లోబడక పవిత్రముగానే యున్నదని నాభావము మానవునకు మొదటి గురువు తండ్రి, ఉపనయనము చేసి వేదవిద్య గరపినవారు రెండవ గురువు. బ్రహ్మజ్ఞానము ఉపదేశించినవారు మూడవ గురువు. ఈ ముగ్గురును ఉత్తరోత్తరోత్తములు. మూడవ గురువు. నారూపుడే' అని, ' గురుకులములో నుండగా ఒకనాడు గురుపత్ని మనలను సమిధలు తెచ్చుటకు ఆరణ్యమునకు పంపెను. ఇంతలో ఉరుములు మెరుపులతో గాలివాన వచ్చెను. మెరకపల్లములు తెలియక మనము ఒండోరుల బట్టుకొని దిక్కు తెలియక తిరుగుచుండగా, మనము సకాలమునకు గృహమునకు రానందున గురువుగారు ఆతురతతో మనలను వెతుకుకొనుచూ వచ్చి మనలను వాత్సల్యముతో దగ్గరకు తీసుకొని మన భక్తికి, గురుసేవకు మెచ్చి మన మనోరధములు ఈడేరు ననియు, మనము అభ్యసించిన విద్యలు సఫలమగుననియు ఆశీర్వదించిన సంగతి నీకు జ్ఞాపకమున్నదా?' యని ప్రశ్నించి, 'నీవు యింటి నుండి నాకేదో ఉపాహారము తెచ్చినట్లున్నదే! నీవు ఏది తెచ్చిననూ నాకు పరమానందమే' అనుచుండ కుచేలుడు ఆ అటుకులమూటను విప్పుటకు సిగ్గుపడుచుండ, తానే అ చిరుగు గుడ్డ మూటను విప్పి, చూచి, ' నాకిష్టమైన అటుకులు తెచ్చినావే!' అని ఒక పిడికెడు అటుకులు తినెను. ఇంకొక పిడికెడు తీసుకొనబోవుచుండగా ప్రక్కనున్న రుక్మిణి చెయ్యిపట్టుకొని వారించి ' నాథా, నీవు భుజించిన ఒక పిడికెడుకే సర్వసంపత్‌ సమృద్ధి కలుగును, ఇక చాలును' అని నివారించెను. ఆ రాత్రి కుచేలుడు కృష్ణుని మందిరములో స్నానపానాది సౌకర్యములన్నీ స్వర్గములో వలె అనుభవించి, మర్నాడు కృష్ణుని వీడ్కోలు గైకొని ఇంటికి బైల్దేరి పోవుచూ దారిలో ' శ్రీ వాసుదేవుని బ్రహ్మణ వాత్సల్యము నేడు ప్రత్యక్షముగా చూచితిని. వక్షమున లక్ష్మి గల కృష్ణుడెక్కడ? ధరించటకు సరియైన వస్త్రములు లేక చిరిగినగుడ్డలతో వెళ్ళిన నిరుపేదను నేనెక్కడ? ఐననూ నన్ను కౌగలించుకొని, సోదరునివలె ఆదరించి, ప్రియురాలి పాన్పుపై కూర్చుండబెట్టి. తాను పాదములపట్టి, రుక్మిణిచేత వింజామర వేయించి, నన్ను దేవార్చనా విధానముగ పూజించినాడే! నేను ధనార్థినె వచ్చి మౌనము వహించియున్న నాకు అటుకులు ఒకగుప్పెడు తినియు ధనము నివ్వక త్రిప్పి పంపుట వలన కృష్ణునికి నాయందు గల నిజమైన ప్రేమ సూచితమైనది, నేను ధన మదాంధుడనై, భగవంతుడైన తనను మరిచిపోవుదునను తలంపుతో, ఎల్లప్పుడు ఆతని ధ్యానము చేయుటకుగాను నాకు ఐశ్వర్యమొసగలేదు!' అని ఇట్టి అద్భుత ప్రేమ కనపరచిన కృష్ణుని స్తుతించుచూ తన గృహోన్ముఖుడయ్యెను.

కుచేలుడు పూర్వము తన గృహమున్న స్థలమునకు పోగా దాన బదులు. అనేక వైభవోపేత ఉపవనములతోనూ సరోవరములతోనూ కూడిన ఒక దివ్యమందిరము కనపడెను. అమితాశ్చర్యము - ఆతడు ఆభవనమును తిలకించుచుండ, దేవతారూపులైన స్త్రీలు పురుషులు గీతవాద్యములతో ఎదుర్కొని ఆ దివ్యభవనములోనికి తీసుకొనిపోయిరి. కుచేలుని భార్య అపర లక్ష్మీదేవి వలె ఆభరణము తోనూ పట్టువస్త్రములతో అలంకరింపబడినదియై ఆనంద బాష్పములురాలగా భర్తపాదములపై బడి నమస్కరించెను. అనేక పరిచాలకుల నడుమ లక్ష్మీవంటి భార్యను చూచి, ఈ ఐశ్వర్యము ఈ దివ్యభవనము కృష్ణుని అనుగ్రహమేనని గ్రహించి ఆయన యందు తనకు యిట్టి భక్తి నిత్యము నిలుచుగాక యని కృష్ణుని ప్రార్థించుచు, విషయాసక్తి విడచి నిజపత్నితో ధర్మమార్గమున గృహస్థాశ్రమ సుఖముల ననుభవించెను."

ఒక సూర్యగ్రహణము రోజున వసుదేవుడు, అకౄరుడు మున్నగు యాదవులు రామకృష్ణులతో కురుక్షేత్రమునకు జని అచట స్నానము లాచరించి బ్రహ్మణోత్తములకు అనేక దానములుచేసిరి. అచ్చటకు నందాది గోపాలకులును, గోపికలునూ గూడ వచ్చిరి. ఒకరినొకరు ప్రేమతో ఆలింగనకుశలప్రశ్నాదులతో ఆదరించుకొనుచూ కృష్ణుని కథలు చెప్పుకొనుచూ ఆనందించిరి. గోపికలు కృష్ణునిచూచి చాలాకాల మగుటచేత ఆయనను సందర్శించి మనస్సులో కౌగలించుకొని ఆనందబాష్పములు రాల్చుచుండ, కృష్ణుడు ఆగోపికలను ఏకాంతస్థలములకు గొనిపోయి కౌగలించుకొని ఆనందమును కలుగజేయగా, వారందరూ ఈ సంసార సాగరిమునుండి తరింప జేయమని ప్రార్థింప కృష్ణుడు వారికి ఆత్మజ్ఞానమును ఉపదేశించెను. అచట ద్రౌపది కృష్ణుని భార్యలను చూచి వారివారి వివాహములు ఎట్లైనవని అడుగగా, వారందరూ సవిస్తరముగ ద్రౌపదికి వివరించి చెప్పిరి.

ఒకనాడు మునులందరూ కృష్ణదర్శనమునకు రాగా వారిని ఉచిత రీతిని ఆదరించి, వసుదేవుడు తనకు ఆత్మజ్ఞానము భోదించమని వారల కోరెను. సర్వయజ్ఞేశ్వరుడైన విష్ణువును నిష్కామముగా యజ్ఞములచే నారాధించ వలెననియు, అందువలన చిత్తశాంతి కలిగి మోక్షసాధన మగుననియు మునులు చెప్పగా వారినే ఋత్విక్కులుగా పెట్టి వసుదేవునితో, సాక్షాత్తు భగవంతుడగు కృష్ణుడు నీ కుమారునిగా అవతరించగా వానినుండి ఆత్మశ్రేయంబు తెలిసికొనలేక, మమ్ములను బోధింపమని అడుగుట విచిత్రముగా నున్నది. గంగా తీర్థవాసులు ఇతర తీర్థములకు జనినట్లు కృష్ణుడు ఇంటిలోనేయున్న కారణమున అనాదరణ కారణమయ్యెను. ఆతని గొప్పతనమును గ్రహించలేక వసుదేవుడు మనలను ఆత్మజ్ఞాన ముపదేశించమని అడుగుచున్నాడు ఈ యజ్ఞము వలన ఆత్మజ్ఞానమునకు సాధనమైన చిత్తశుద్ధికలిగినది. ఇక కృష్ణునివద్ద ఆత్మజ్ఞానము తెలసికొనుట ధర్మము అనివారు వసుదేవునికి చెప్పి వెడలిపోయిరి. అంతవసుదేవుడు కృష్ణుని గొప్పతనమును స్మరించుచూ కృష్ణుడు తనవద్దకు నమస్కరించుటకు రాగా ' కృష్ణా ఈ జగము ఎవ్వని యందు ఎవ్వనిచే ఏవిధముగా ఎవనికొరకు ఏర్పడినది ? దీని తత్వమును బోధింపు మనియు ఇంకనూ దేహముపై ఆత్మబుద్ధియు, నీపై పుత్రబుధ్ధియు చేసి ఈ సంసార సాగరములో పడియున్న మాకు ఆత్మజ్ఞానము బోధింప'మని కోరగా కృష్ణుడు ' ఈ చరాచరాత్మక జగమంతయూ బ్రహ్మమేకాని అన్యము కాదనియు, ఈ నానాత్వమునందు కల్పిత' మనియు కృష్ణుడు బోధించగా, వసుదేవుడు ఈ నానాత్వమునందు భేదబుధ్ధి పోగొట్టుకొని సర్వత్మ భావముతో ఆనందానుభవము పొందెను.

ఇట్లు కొంతకాలము గడచిన తరువాత కృష్ణుడు మృతుడైన గురుపుత్రుని తెచ్చిన సంగతి విని, దేవకి, కంసుడు చంపిన తన ఆరుగురు పుత్రులను చూపించమనికోరెను తల్లిని సంతోషపెట్టుటకు గాను కృష్ణుడు తనయోగమాయచే సుతల లోకమునకు జని , ఆలోకవాసుల ఆతిథ్యము స్వీకరించి వారినడిగి తన ఆర్గురు అన్నలను తీసికొని ద్వారకకు వచ్చి తల్లికి చూపగా, దేవకి ఆ కుమారులను కౌగిలించుకొని ప్రేమాతిరేమున స్తన్యమిచ్చి ఆనందించగా, వారు కృష్ణునికి దేవకీ వసుదేవులకు నమస్కరించి అందరూ చూచుచుండగా అంతరిక్షములోనికి వెడలిపోయిరి.

సుభద్రపరిణయము

అర్జునుడు తీర్థయాత్రలు సల్పుచూ ప్రభాసక్షేత్రమునకు జని తన మేనమామకూతురగు సుభద్రను దుర్యోధనునకు యిచ్చి వివాహము చేయ బలరాముడు నిశ్చయించినాడనియు, మిగిలిన వారికి ఇది యిష్టములేదనియు తెలిసి, ఆమెను తాను పెండ్లిచేసుకొనదలచి, త్రిదండి యతి వేషముతో ద్వారకకు వెడలెను. ద్వారకావాసులును, బలరాముడునూ నిజమైన యతీశ్వరుడేయని నమ్మి అతనిని సత్కరించుచుండిరి. ఒకనాడు ఆ కపటయతిని బలరాముడు తన యింటికి తెచ్చి శ్రధ్ధతో బిక్షయిడి తన యింట నుంచుకొని సపర్యలకు సుభద్రము నియోగించెను. అర్జునుడు సుభద్రను చూడగనే ఆమె సౌందర్యమునకు మోహపడి ఆమెను ఎట్లు వివాహమాడుదునా యని ఆలోచించుచుండెను. సుభద్రగూడ అర్జునుని చూడగానే అట్లే అనుకొనెను ఒకనాడు యాదవులందరూ దేవయాత్రకై మరియొక పట్టణమునకు పోవుచుండగా, సుభద్ర ఎక్కిన రథమును అర్జనుడు సారథియై, అడ్డము వచ్చిన వారిని తరిమివేసి సుభద్రము తీసుకొనిపోయెను. ఆ సంగతి తెలిసిన బలరాముడు అతనిని శిక్షించి సుభద్రము తీసుకొని వచ్చుటకు బయలుదేరగా కృష్ణుడు బలరాముని శాంతపరిచి, ఆ యతీశ్వరుడు అర్జనుడేయని చెప్పి సుభద్రార్జునులు పరస్పరానురాగ భరితులై వివాహమాడ నిశ్చయించుకొన్నారని బలరామునికి తెలియజేయగా, ఆతడు శాంతించి సుభద్రార్జునుల పిలపించి వైభవోపేతముగా వివాహము జరిపెను.

మైథిల శృతదేవులకు కృష్ణుడు అతిథిగాజనుట

కృష్ణచంద్రుని చిత్రవిచిత్రములైన చరిత్రలు వినగోరుచున్న పరీక్షిత్తునకు శుకయోగీంద్రుడు ఈ కథను చెప్పెను.

పూర్వము శృతదేవుడను బ్రహ్మణుడు మిథిలాపురమున దైవప్రాప్తమునకు తృప్తిపొంది శాంతుడు, విద్వాంసుడునై గృహకృత్యములు నిర్వహించుచూ, కృష్ణుని యందు భక్తి కలిగి యుండెను. ఆ మిధిలారాజ్యమునుపాలించు బహుళాశ్వుడను రాజుయును నిరహంకారయై శాంతుడై కృష్ణభక్తి చేయుచుండెను. ఇట్లుండ నొకనాడు ఆ బ్రహ్మణుడును, ఈ రాజుయును కృష్ణుని తమతమ గృహములకు ఆతధ్యమునకు రమ్మని ఆహ్వానించిరి. భక్తుల నిద్దరనూ అనుగ్రహింపదలచి రథము నధిష్టించి బయలుదేరెను. ఈ వార్తవిని నారదుడు, వ్యాసుడు, మైత్రేయుడు, చ్యవనుడు మున్నగు మహర్షులతో నేనుగూడ కృష్ణుని అనుసరించితిమి. అందరమూ విదేహమునకు చేరగా, పౌరులందరూ స్వాగతము చెప్పి పూజించిరి. మైధిలుడును, శృతదేవుడును పూజించి, సాష్టాంగప్రణామము లాచరించి ఎవరికివారు తమతమ ఆతిథ్యముల నంగీకరింప ప్రార్థించిరి. కృష్ణుడు వారిద్దరకూ ప్రియము చేయదలచినవాడై ఒకరి కొకరికి తెలియకుండ తనతోవచ్చిన మునులతో గూడ ఇద్దరి గృహములకూ ఏకకాలమున జనెను. ఎవరికి వారు కృష్ణుడు మునులతో సహా తమ యింటికే వచ్చివారని సంతసించిరి. బహుళాశ్వుడు అందరకూ పాదప్రక్షాళన మొనరించి ఆ జలములను సకుటుంబముగా శిరస్సున జల్లుకొని గంధమాల్యాదులతో పూజించి, మృష్టాన్నభోజన మిడి సేవచేసెను. అట్లే శృతదేవుడునూ కృష్ణునికి సకలసపర్యల జేసి సాత్వికాహారమును భుజింపజేసి తనకుకలిగిన మహాభాగ్యమునకు ఆనందిచుచుండెను. అంతట కృష్ణుడు ఆ బ్రహ్మణోత్తమునితో ' శృతదేవా, నాకు భక్తితో సేవలు చేసినందుకు సంతోషమే! కాని నాతో వచ్చిన ఈ మునులు నిన్ను అనుగ్రహింప వచ్చిరని తెలుసుకోలేకపోతివి. వీరిపాదరేణువులు లోకములను పవిత్రముచేయును. జన్మమాత్రములనే బ్రహ్మణుడు జీవులలోనెల్ల ఉత్తముడు ; అతడే విద్వాంసుడై తపస్సు ఉపాసన చేయగలిగిన చెప్పవలసిన దేమి? బ్రహ్మణమూర్తికంటె ఈ చతుర్భుజరూపము నాకు ప్రియము కాదు. విప్రుడు సర్వవేదమయుడు. నేను సర్వవేదమయుడను. కావున ఈ బ్రహర్షులను శ్రద్ధతో పూజింపుము. అట్లొనర్చిన నేను పూజితుడ నగుదునుగాని, వారల పూజింపక నన్ను ఎంత గొప్పగా పూజించిననూ నాకు సంతోషకరముకాదు.' అని చెప్పగా శృతుదేవుడు ఆ మునులనుగూడ కృష్ణునితో పాటు ఆరాధించి సద్గతి గాంచెను.

శృతిగీతలు

పరీక్షిన్మహారాజు తనకు కలిగిన సందేహమును శుకయోగీంద్రునితో ఇట్లు విన్నవించెను " మునీంద్రా కార్యకారణాతీతమై నిర్గుణమై నుర్దేశింప నలవిగాని బ్రహ్మమును గూర్చి గుణవృత్తులైన శృతులు ఎట్లు ప్రవర్తిల్లును?" అందుకు శుకయోగి "రాజేంద్ర జీవులకు విషయ భోగము, కర్మానుష్ఠానము, తత్తల్లోక భోగము, కైవల్యము అను పురషార్థ చతుష్టయమును సిధ్ధింప ఈశ్వరుడు బుద్ధీంద్రియ మనఃప్రాణము లను ఉపాధులను సృజించెను. జీవులకు స్వరూపోపపాదనము లేకున్న మోక్షము సిధ్ధింపదు. శృతులు సాక్షాద్వృత్తిని బ్రహ్మబోధకములు కాకున్నను, పరమేశ్వరోద్దిష్టమైన మోక్షవిషయమై గౌణవృత్తి చే బోధించును. ఉపనిషన్మహా వాక్యములకు జహదజహర్ల క్షణావృత్తి గైకొని విరుద్ధాంశముల త్యజించి అనుగతమైన చిదర్థ మాత్రముగ్రహించి సమన్వయమును చేసినట్లుగనే శృతులు నిర్గుణ బ్రహ్మమును బోధించును. ఉపనిషత్తులు ఇట్లు బ్రహ్మపరంబులని పెద్దలు సిద్ధాంతీకరించిరి. కావున కుతర్కములకు లోనుగాక ఈ సిద్ధాంతము నవలంబించు నతడు దేహాద్యుపాధిరహితుడై పరమపదము పొందును.

పూర్వము నారాయణ మునీంద్రుడు నారదునకు ఈ విషయము బోధించెను. నారదుడు లోకసంచారము చేయుచు ఒకరోజున నారాయణ మహర్షిని గాంచి నమస్కరించి, ఈ విషయమునే అడుగగా ఆతడు ' తొల్లి జనలోకమున బ్రహ్మసత్రమను యాగము జరిగిన సందర్భమున ఈ ప్రశ్న ఉదయించగా దాని జవాబు యిట్లుండెను. నిద్రపోవు సార్వభౌముని వేకువజామున స్తుతిపాటకులు మేలుకొలుపులు పాడి లేపుదురు. అటులనే నిజ శక్తులతో ఈ జగత్తునంతను ఉపసంహరించి యోగనిద్రపరుడైన పరమాత్ముని ప్రళయాంతమున తత్ర్పధమ నిశ్వాస నిర్గతములైన శృతులు ఈ విధముగా బోధించినవి. అజితా సర్వోత్కర్ష మావిష్కరింపుము; ఆ విద్యను బొలియింపుము సర్వశక్తులను ఉద్భోధము గావించు నీవు ఆత్మ స్వరూపముననే మాయను వశీకరించుకొని, సమస్త ఐశ్వర్యములను బడసిన వాడవు సృష్టి మున్నగు కార్యములలో నీవు మాయా యోగమున క్రీడింతువుగాని దానికి వశుడవు గావు. ఘటాది పదార్థములకు ప్రకృతి ద్రవ్య మగు మృత్తునందు ఉత్పత్తిలయములు కలుగునట్లు, అవికారమైన బ్రహ్మము వలన ఈ జగమునకు ఉత్పత్తిలయములు కలుగును. కావున సర్వమూ బ్రహ్మవశిష్టమైన కారణముచేత జగదీశ్వరులని నిరూపింపబడు ఇంద్రాదులెల్ల బ్రహ్మమేగాని వేరుగాదు. నీచే సృష్టింపబడి దేనిని బోధించిననూ నిన్నే బోధించినట్లగును. నరులు నీకు భక్తులగుదురేని, జీవనసాఫల్యము గాంతురు. అట్లు కానిచో తోలుత్తిత్తుల రీతి వృధాశ్వాసమాత్రులు. స్థూలసూక్ష్మములగు అన్నమయాదుల కతిరిక్తంబై తత్సాక్షియై శేషించు అబాధ్యసత్య బహ్మము నీవు. మిధ్యాభూతములైన దేహములందు. సత్యమై నిర్విశేషమై సన్మాతమై వెలయు నీరూపమును కర్మఫలాభిసంధిరహితులైన నిర్మల చిత్తులు ఎరుగుదురు దుర్బోధమగు ఆత్మతత్వము బోధింప, మూర్తి నంగీకరించిన నీ కధలు అను మహాసుధాసాగరమున మునిగి, బడలికలు బాసి, కొందరు రాజహంసల వలె భక్తుల సంగమున గృహముల త్యజించి, భగవద్బక్తిచే మోక్షమునేకోరరు. సృష్టికి పుర్వమేయున్న నిన్ను ఉత్పత్తి వినాశముల పొందు నెవ్వరెరుగుదురు ? అసత్తైన జగత్తుకు ఉత్పత్తి జరిగెననియు, సత్తైన బ్రహ్మమే ఉత్పత్తి గాంచెననియు, ఏకవింశతి ప్రకార దుఃఖముల ధ్వంసమే మోక్షమ యు కర్మఫలవ్యవహారము సత్యమనియు, పలువురు భ్రాంతులై ఉపదేశింతురు. మనోమాత్రవిసితమైన త్రిగుణాత్మక ప్రపంచము అసత్తైననూ నీయందు అధిష్ఠాననత్తచే సత్తువలె తోచును. కాంచనమును కోరువారు తద్వికారమగుకుండలాదులను కాంచనముకాదని త్యజింతురా ? కనుక ఆత్మకృతమై అనుప్రవిష్టమైన విశ్వము ఆత్మరుపము. సర్వభూతవాసుడవని నిన్ను ఉపాసించువారు మృత్యువును గణింపరు. భవదిధిముఖునైన అభక్తులను ఎంతవిద్వాంసులైననూ పశువులకు వోలె, వేదవాక్కున బంధింతురు. నిన్నాశ్రయింపని వారికే జన్మమరణాది భయము కలుగును కాని , నిన్ను అనువర్తించు వారికి సంసారభయ మెట్లుకలుగును? సత్తువలన పుట్టిన కారణమున ఈ విశ్వమును సత్తు అందుమేని, తర్కమున కార్య కారణములకు భేదము ఏర్పడుట వలన ఆ యుక్తి కుదరదు. కావున సదాత్మత్వము సాధింపనశక్యము. సృష్టికి పూర్వమును ప్రళయమునకు పిమ్మటనూ లేని విశ్వము ఈ నడుమను మిధ్యాభూతమే అయిననూ, కేవలుడైన నీయందు ప్రతీతి మాత్రమున తోచుచున్నది. కావున మృదాది కార్యములగు ఘటాదులవలె బ్రహ్మకార్యములైన ఆకాశాదులును నామమాత్రాదులే. మృదాదులరీతి బ్రహ్మమే సత్యము. ప్రపంచము సత్యమని తలచువాడు అవిద్వాంసుడగును. మాయచే దేహేంద్రియాదుల యందు ఆత్మాధ్యానము చేసి జీవుడు సంసారమున పడును. నీవన్ననో ఆ మాయను నిరసింతువు. యతులును హృదయము లోని కామ వాసనలను ఉన్మీలింపరేని హృదయస్థుడవయ్యూ, నీవు దుర్లభుడవు. సగుణ పక్షమున గుణానంతత్వము, నిర్గుణతత్వమున అగోచరత్వము కారణములు కాగా శృతులు తద్భిన్ననిరాసమున అవధిభూతూడైన నీయందు పర్యవసన్నంబులై తాత్పర్య వృత్తిని బోధించె' నని చెప్పెను.

ఇట్లు చెప్పగా నారదుడు శ్రధ్ధతో గ్రహించి తన గురువగు నారాయణ మునీంద్రునకు నమస్కరించి, శలవు గైకొని, తండ్రివద్ద కేగి తాను విన్నదంతయూ తండ్రికివివరించి చెప్పెను"

కృష్ణార్జునులు మృతబ్రహ్మణపుత్రులను తెచ్చుట

పరీక్షిన్నరంద్రా! కృష్ణుడు ద్వారకలో నుండగా ఒకనాడు ఒక విప్రుడు పుట్టగానేచనిపోయిన తన శిశువును తెచ్చి రాజద్వారమున వుంచి విలపించుచు ' బ్రహ్మద్వేషి, శఠుడు, విషయాసక్తుడు అగు రాజయొక్కదోషమునకు నాకుమారుడు చనిపోయెను. దుశ్శీలుడు అజితేంద్రియుడునగు రాజుపాలమున ప్రజలు పేదలై నిత్యము దుఃఖమున కుందురు" అని చెప్పి ఆ శిశువునచటనే వదలిపోయెను. ఈ విధముగా చనిపోయిన ఎనిమిది పుత్రులను తెచ్చి రాజద్వారమున పడవేసెను. చివరుకు అతని తొమ్మిదవ కుమారుడుగూడ చనిపోగా, రాజద్వారమునన్ను ఆ బ్రహ్మణుని దుఃఖమును చూచి జాలిగొని అచ్చటనున్న అర్జునుడు ఆ బ్రహ్మణునితో ' విప్రోత్తమా! ఈ దేశమున విల్లుబట్టిన రాజన్యుడు కాన్పడడు ఏ దేశమున బ్రాహ్మణులు ధనదార సుతాది వియోగమున విలపింతురో ఆ దేశపాలుకుల నింద్యులు. నేను నీపిల్లలను రక్షించెదను. నేను మృత్యువును గెలిచి నీబిడ్డను తెచ్చియిత్తును. అట్లు కాని యడల అగ్నిలో పడి నశించెదను. అని చెప్పగా ఆ బ్రహ్మణుడు సంతసించి వెడలిపోయెను. తిరిగి ఆ బ్రహ్మణుని భార్యగర్భవతియై ప్రసవసమయమురాగా అర్జునుని తనయింటికి తీసుకొనివచ్చెను. అర్జునుడు శుచియై మహేశ్వరునకు ప్రణమిల్లి దివ్యాస్త్రముల స్మరించి, పురిటిగదికి నలువైపుల దివ్యాస్త్రశరములతో పంజరము కట్టి కాచియుండెను. ఆ విప్రపత్ని ప్రసవించగా పుట్టిన కుమారుడు దేహముతో గూడ అదృశ్యుడయ్యెను. అంతట ఆ బ్రాహ్మణుడు కృష్ణసన్నిధిలోనున్న అర్జునుని దుఃఖముతో నిందించెను అర్జునుడు తన ఆత్మవిద్యాయోగముతో గాండీవము ధరించి యమపురికి జనెను. అచ్చటకానక, స్వర్గపాతాళాది లోకములలో గూడ వెదకి కానక, తన ప్రతిజ్ఞ వమ్ము అయినదని అగ్ని ప్రవేశము చేయ నిశ్చయించగా, కృష్ణుడు వారించి, ఆతనిని తన రథముపై కూర్చుండబెట్టుకొని, ప్రయాణమై సప్తదీపములను, సప్తసముద్రములను, సప్తగిరులను దాటి, లోకాలోకము నతిక్రమించి గాఢాంధకారము ప్రవేశింపగా, తనచక్రముచే ఆ యంధకారమును పోగొట్టి అచ్చట మణిస్తంభసహస్రశోభితమై దేదీప్యమానమై వెలుగుచున్న వనమును ప్రవేశించెను. అచ్చట అనంతుని భోగతల్పమున సుఖాసీనుడై, లలిత పీతాంబరాదులతో విరాజిల్లుచు, నీలమేఘచ్ఛాయతో నొప్పారు నారాయణుని జూచి కృష్ణార్జునులు మ్రొక్కిరి. అంతట నారాయణుడు కృష్ణార్జునులజూచి " మదంశసంభూతులారా, మిమ్ముజూడగోరి నేను విప్రపుత్రులను ఇచ్చటకురావించితిని ఇరుగో ఆవిప్రబాలురు" అని వారిని వప్పగించెను. అంతట కృష్ణార్జునులు ఆ విప్రబాలకులను తీసుకొని ద్వారకకు వచ్చి ఆ విప్రునికి సమర్పించిరి.

అంతట అర్జనుడు అద్భుతమైన కృష్ణతేజస్సును చూచిలోకములో పౌరుషమనునది కృష్ణుని కరుణవలననే కలుగవలెనుగాని మరియోగవిధముగా కలుగదని, తనగర్వమును వీడి కృష్ణుని అధిక భక్తితో సేవించెను.

     

 
       
     

"Bharath First - I Love My Bharath"

   
 

www.sanatanadharm.com - play store app (sanatana dharm)  

 
 

"Bharathiya Sanatana Dharmam" and Sanatana Dharm & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. 2019-2025 Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.